జమ్మూ/గాంధీనగర్/తిరువనంతపురం/దిస్పూర్: జమ్మూకాశ్మీర్, గుజరాత్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా ఆయా రాష్ర్టాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్టవార్ జిల్లా చత్రూ ప్రాంతంలో క్లౌడ్‌బరస్ట్ సంభవించింది. శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా దూసుకొచ్చిన ఆకస్మిక వరదలతో చత్రూలోని దుకాణాలు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఈ క్లౌడ్‌బరస్ట్ వల్ల ప్రాణనష్టం జరగలేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. క్లౌడ్‌బరస్ట్ ఘటనపై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. వరదలతో దెబ్బతిన్న షాపులకు తగిన నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.
గతేడాది చసోతి ఘటన అనుభవంతో కిష్టవార్, మచ్ఛైల్‌లలో 2 అత్యాధునిక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేశామన్నారు. పడ్డర్ ప్రాంతంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్) ఏర్పాటు ప్రక్రియ కూడా కొనసాగుతోందని మంత్రి వివరించారు. వానలకు తన్నమండి, -డీకేజీ, బుఫ్లియాజ్ రోడ్డు తీవ్రంగా దెబ్బతినడంతో .. వాహనాలను బింబర్ గలి గుండా మళ్లిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గుజరాత్, కేరళ, అస్సాంలో ఇదీ పరిస్థితి
మరోవైపు గుజరాత్‌లోని సూరత్, నవసారి జిల్లాల్లోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అంబికా తాలూకాలో వరదలు సంభవించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సుమారు 27 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నర్మదా జిల్లాలో గర్భిణీల కోసం ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టి సురక్షిత ప్రసవాలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జలాశయాలు ప్రమాద స్థాయికి చేరుకున్నాయి.
కేరళలోనూ భారీ వర్షాల కారణంగా నదుల ప్రవాహం విపరీతంగా పెరిగింది. పథనంతిట్ట, కొట్టాయం జిల్లాల నుంచి వస్తున్న వరద నీటిని నియంత్రించేందుకు ఆలప్పుజ జిల్లాలోని తొట్టప్పళ్లి స్పిల్‌వే, తన్నీర్‌ముక్కం బ్యారేజీల గేట్లు తెరిచారు. అదనపు నీటిని అరేబియా సముద్రంలోకి వదిలేస్తున్నారు.
లోతట్టు ప్రాంతాలైన కుట్టనాడ్ పరిసరాల్లో ముంపు ముప్పు తప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పునరావాస శిబిరాలను సిద్ధం చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. నదీతీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అస్సాంలో వరద ఉధృతికి తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలతో అస్సాంలో ఈ ఏడాది వరద మృతుల సంఖ్య 82కి చేరింది. శివసాగర్, చరైదేవ్, జొహాట్, గోలాఘాట్, నాగావ్ జిల్లాల్లోని 1.92 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని అధికారులు శనివారం తెలిపారు. ప్రస్తుతం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తుండగా.. 54 పునరావస శిబిరాల్లో సుమారు 13 వేల మంది తలదాచుకున్నారు.
